అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tesla | ప్రముఖ ఎలక్ట్రానిక్ కార్ల ఉత్పత్తిదారు అయిన టెస్లా (Tesla).. భారత్‌లో దూకుడు పెంచుతోంది. ఇటీవలే దేశంలో మొదటి షోరూంను ప్రారంభించిన సంస్థ.. రెండో షోరూం (Second Showroom) ఏర్పాటు కోసం వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెలాఖరులోగా రెండో షోరూంను ప్రారంభించాలన్న లక్ష్యంతో సాగుతోంది.
టెస్లా కంపెనీ భారత్‌లో తన మొదటి షోరూమ్‌ను దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయి (Mumbai)లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో ఈనెల 15వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశ రాజధానిపై దృష్టి సారించింది. ఐజీఐ(IGI) విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ప్రీమియం వాణిజ్య కేంద్రమైన ఏరోసిటీ(Aerocity)లోని వరల్డ్‌మార్క్ కాంప్లెక్స్‌లో 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో షోరూమ్‌ను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసింది. ఈ కాంప్లెక్స్ బ్రూక్‌ఫీల్డ్ యాజమాన్యంలో ఉంది.
షోరూం ఏర్పాటు కోసం కంపెనీ నెలకు రూ. 25 లక్షలతో అద్దె ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇది టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రధానంగా మోడల్ వై ఎస్‌యూవీని (SUV) ప్రదర్శించే ఫ్లాగ్‌షిప్ రిటైల్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈనెలాఖరులోనే రెండో షోరూమ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి.
Tesla | అక్కడే ఎందుకంటే..
ఏరోసిటీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ఈ ప్రాంతం హోటళ్లు, రిటైల్ దుకాణాలు, గ్లోబల్ కార్పొరేట్ కార్యాలయాలతో కూడిన ప్రీమియం వాణిజ్య కేంద్రం. ధనవంతులైన కస్టమర్లను ఆకర్షించడానికి టెస్లా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆటో అమ్మకాలు మందగించాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్ అయిన టెస్లా భారతదేశంపై దృష్టి సారించింది. తన వ్యాపార విస్తరణలో భాగంగా దేశంలో రెండో షోరూమ్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
Tesla | సూపర్ ఛార్జర్ల ఏర్పాటు..
టెస్లా కంపెనీ షోరూంల ఏర్పాటుతోనే ఆగిపోవాలనుకోవడం లేదు. Delhiలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించేందుకూ ప్లాన్ చేస్తోంది. ఏరోసిటీ, సాకేత్, గోల్ఫ్ కోర్స్ రోడ్(Golf Course Road), నోయిడాలలో నాలుగు చొప్పున సూపర్ ఛార్జర్ స్టేషన్లు (మొత్తం 16 ఛార్జర్లు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముంబయిలోని థానే, బీకేసీ, లోయర్ పరేల్, నవీ ముంబయిలలో నాలుగు చొప్పున 16 సూపర్ ఛార్జర్లు (Super chargers) ప్లాన్ చేశారు. టెస్లా భారతదేశంలో సేల్స్, కస్టమర్ సర్వీస్, ఆపరేషన్స్ రోల్స్ కోసం ఉద్యోగ నియామకాలను కూడా ప్రారంభించింది.