అక్షరటుడే, వెబ్‌డెస్క్: Roja | నటిగానే కాదు రాజకీయ నాయకురాలిగానూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది రోజా (Roja). తాజాగా ఆమె ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ బోరున ఏడ్చారు. తనపై జరిగిన దూషణలు, వ్యక్తిగత విమర్శలపై ఆవేదన వ్యక్తం చేశారు. రోజా మాట్లాడుతూ.. టీడీపీకి (TDP) చెందిన కొంతమంది “పెయిడ్ బ్యాచ్” సభ్యులు, సోషల్ మీడియా (Social Media) ద్వారా తనపై పర్సనల్‌గా దాడులు చేస్తున్నారని చెప్పారు. జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి తనపై మాటల యుద్ధం చేయించారని పేర్కొన్నారు. “నగరి ఎమ్మెల్యే భానుప్రకాశ్ రెడ్డి (MLA Bhanuprakash Reddy) నా మీద మాట్లాడిన తీరు చాలా దారుణం. ఆయనకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే అలా మాట్లాడగలరా?” అంటూ ప్రశ్నించారు.
Roja | నా కుటుంబాన్ని కూడా..
ఇక తన పిల్లలపై కూడా అపవాదులు, మార్ఫింగ్ ఫొటోల ద్వారా మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని రోజా చెప్పింది. నా పిల్లల ఫొటోల్ని మార్ఫింగ్ చేసి పంపుతున్నారు. నా కొడుకు ఆ ఫొటోలు చూసి డిప్రెషన్‌కు లోనయ్యాడు.. సూసైడ్ చేసుకోవాలనిపించిందట. నా కూతురు ఈ మానసిక వేధింపులు తట్టుకోలేక అమెరికాకు వెళ్లిపోయింది. ఇది నాకు తట్టుకోలేని బాధ. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), తన భర్త, మా అన్నలు ఎప్పుడూ అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ‘జగన్ గారిని నేను నా సోదరుడిలా భావిస్తాను. ఆయన ఒక చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారు. నా భర్త, అన్నల మద్దతుతోనే ఈ స్థాయికి వచ్చాను ’ అని రోజా పేర్కొంది.
తనపై వస్తున్న విమర్శలకు, నిందల విషయంలో ధైర్యంగా పోరాడతానని, న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని రోజా స్పష్టం చేశారు. ‘నన్ను కిందికి లాగాలనే ప్రయత్నాలు చాలా చేశారని తెలుసు. కానీ నేను తట్టుకుని నిలబడాను. ఇప్పుడు కూడా అదే చేయగలను. దేవుడు ఉన్నాడు.. దుర్మార్గానికి న్యాయం జరిగే రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. చివరిగా రోజా రాజకీయాల్లో (politics) మహిళలు ఎదుర్కొంటున్న మానసిక వేధింపుల గురించి కూడా మాట్లాడారు. “ఒక మహిళని వేధించి ఆమె కళ్లలో నీళ్లు తెప్పించాలనుకునే వాళ్లను భగవంతుడు వదలడు” అని ఉద్వేగంగా తెలిపారు. రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.