అక్షరటుడే, వెబ్‌డెస్క్: Andre Russel | వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలకనున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు రస్సెల్. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) కు అధికారికంగా వీడ్కోలు చెబుతాడు. ఈ రెండు మ్యాచ్‌లు జమైకాలోని సబీనా పార్క్ స్టేడియం (Sabina Park Stadium)లో జరగనున్నాయి. ఆయన రిటైర్మెంట్‌ను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది.
Andre Russel | రెండు మ్యాచ్‌లే..
మెరూన్ జెర్సీలో విండీస్ తరపున ఆడడం నా జీవితంలో గర్వించదగిన ఘనత. చిన్నతనంలో ఎన్నటికీ ఊహించని స్థాయికి చేరుకోగలిగాను. ఈ ప్రయాణం నాకు ఎంతో నేర్పించింది, నన్ను మరింత మెరుగైన ఆటగాడిగా తీర్చిదిద్దింది. నా దేశంలో, నా కుటుంబం, స్నేహితుల ముందు ఆడే అవకాశం కలగడం నాకు చాలా ప్రత్యేకం. నేను మరొక తరం క్రికెటర్లకు ప్రేరణగా ఉండాలని, నా అంతర్జాతీయ కెరీర్‌ను గౌరవంగా ముగించాలని కోరుకుంటున్నాను అని రస్సెల్(Andre Russel) పేర్కొన్నాడు. రస్సెల్ అంతర్జాతీయ కెరీర్ గణాంకాలు చ ఊస్తే.. టీ20లు: 84 మ్యాచ్‌లు, పరుగులు: 1,078 (సగటు: 22.00, హైస్కోర్: 71, 3 హాఫ్ సెంచరీలు), వికెట్లు: 61 (సగటు: 30.59), వన్డేలు: 56 మ్యాచ్‌లు, పరుగులు: 1,034 (సగటు: 27.21, 4 హాఫ్ సెంచరీలు), వికెట్లు: 70 (సగటు: 31.84, ఉత్తమ గణాంకాలు: 4/35)
టెస్ట్ మ్యాచ్‌లు చూస్తే కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక రస్సెల్ ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌లలో ప్రదర్శించిన ఆటతీరు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంది. మొత్తం 561 టీ20 మ్యాచ్‌లు ఆడగా, పరుగులు: 9,316 (సగటు: 26.39, స్ట్రైక్ రేట్: 168+, 2 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు) చేశాడు. వికెట్లు: 485 (సగటు: 25.85). కేవలం విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గానే కాదు, కీలక వేళల్లో బౌలింగ్‌తోనూ మ్యాచు స్వరూపాన్ని మార్చే సామర్థ్యమున్న ఆండ్రీ రస్సెల్, తన దేశం తరఫున అద్భుతంగా సేవలందించాడు. ఇప్పుడు, తన సొంత నేలపై ఆటకు గుడ్‌బై చెబుతుండగా ఆయన మెరూన్ జెర్సీని ధరించి చేసిన ప్రతీ పరుగూ, ప్రతీ వికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.