అక్షరటుడే, వెబ్డెస్క్: Traffic Police | రోడ్డు ప్రమాదాల్లో నిత్యం వందలాది మంది మృతి చెందుతున్నారు. చాలా రోడ్డు ప్రమాదాలకు మద్యం తాగి వాహనాలు నడపమే కారణం. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నిత్యం డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్న పోలీసులు.. వీకెండ్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరి మందుబాబుల ఆట కట్టిస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం తర్వాతే డ్రంకన్ డ్రైవ్ టెస్ట్(Drunk Driving Test)లు చేస్తున్నారు. ఇక నుంచి పగలు కూడా చేయాలని పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Traffic Police | మద్యం మత్తులో..
నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. జాగ్రత్తగా వాహనాలు నడపాలి. కానీ కొంతమంది మద్యం మత్తులో ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నారు. ఇలాంటి వారితో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) మందుబాబుల ఆట కట్టించడానికి పగటి పూట కూడా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేపట్టనున్నారు. ఇక నుంచి ఆకస్మికంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు.
Traffic Police | పాఠశాలల బస్సు డ్రైవర్లు సైతం..
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వీకెండ్స్, నైట్ మాత్రమే చేస్తారనే భావనలో ప్రజలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో రాత్రిపూట మాత్రమే తనిఖీలు చేపట్టామన్నారు. అయితే కొందరు పగటి పూట కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు తేలడంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు (Private School Bus Drivers) మద్యం తాగి బస్సు నడుపుతూ దొరికారన్నారు. ఇలా 35 ప్రైవేట్ బస్సు డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్నారు. దీంతో పగటి పూట కూడా తనిఖీలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు.
Traffic Police | జైలుశిక్ష వేస్తున్న మారని తీరు
ప్రస్తుతం డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెడుతున్నారు. వారి మద్యం మోతాదు, గతంలో దొరికారా అని ఆరా తీసి న్యాయమూర్తులు జరిమానాలు, జైలుశిక్ష విధిస్తున్నారు. అయితే జైలుశిక్ష విధిస్తున్నా.. మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు.