Site icon aksharatoday.in

Iran-Israel Ceasefire | కాల్పుల విర‌మ‌ణకు ఓకే.. ఇంత‌కూ యుద్ధం గెలిచిందెవ‌రు..?

Iran-Israel Ceasefire

Iran-Israel Ceasefire | కాల్పుల విర‌మ‌ణకు ఓకే.. ఇంత‌కు యుద్ధం గెలిచిందెవ‌రు?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran-Israel Ceasefire | ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల సంఘర్షణకు తెర ప‌డింది. రెండు దేశాల‌తో పాటు అమెరికా(America) కూడా పాలుపంచుకున్న ఈ యుద్ధం ప్ర‌స్తుతానికి నిలిచిపోయింది. అమెరికా ఇరాన్‌పై దాడి చేసిన త‌ర్వాత మ‌ధ్య‌ప్రాచ్యంలో ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతుంద‌న్న భ‌యాందోళ‌న నెల‌కొంది. అయితే ఆయా దేశాల మ‌ధ్య కాల్పుల విరమణ ఒప్పందం జ‌గ‌ర‌డం ప్రపంచానికి ఉపశమనం కలిగించింది. ఇరాన్ అణుబాంబులు త‌యారు చేస్తుంద‌ని ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం.. ఏం సాధించింది..? ప్ర‌స్తుతానికి ఉద్రిక్త‌త‌లు స‌ద్దుమ‌ణిగిన‌ప్ప‌టికీ, ఈ సంఘ‌ర్ష‌ణ‌లో ఎవ‌రు గెలిచారు.. ఎవ‌రు ఓడార‌న్న‌దే ఇప్పుడు అంద‌రి మ‌దిని తొలుస్తున్న ప్ర‌శ్న‌.

Iran-Israel Ceasefire | అంతా ఆశ్చ‌ర్య‌క‌మే..

వాస్త‌వానికి ఇజ్రాయెల్‌ – ఇరాన్ మ‌ధ్య జ‌రిగిన ర‌ణమంతా ఆశ్చ‌ర్యం, ఆసక్తిక‌రంగానే సాగింది. అమెరికాతో ఇరాన్ ఈ నెల 15వ తేదీన అణు చ‌ర్చ‌లు జ‌రపాల్సి ఉండ‌గా, రెండ్రోజుల ముందే ఇజ్రాయెల్ టెహ్రాన్‌(Tehran)పై బాంబుల‌తో దాడికి దిగింది. దీంతో చ‌ర్చ‌ల‌ను ప‌క్క‌న పెట్టిన ఇరాన్ కూడా ప్ర‌తీకార దాడులు ప్రారంభించింది. మ‌రోవైపు, ఈ యుద్ధంలో చేర‌డానికి వెనుకాముందు అయిన అమెరికా దిగ‌క త‌ప్ప‌లేదు. అయితే, దీనిపై రెండు వారాల్లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండ్రోజులు కూడా తిర‌క్కుండానే ర‌ణరంగంలోకి దిగ‌డం ప్ర‌పంచాన్ని విస్మ‌యానికి గురి చేసింది. ఇది భౌగోళికంగా, రాజకీయంగా కీల‌క‌మైన ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త‌త‌లకు దారితీస్తుందనే భయాలను రేకెత్తించింది. మ‌రోవైపు, ఖతార్‌(Qatar)లోని అమెరికా అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడుల‌కు దిగ‌డంతో.. ఈ ర‌ణ‌రంగం ప్రపంచాన్ని చుట్టుముడుతుంద‌న్న భయాందోళ‌న ఏర్ప‌డింది. కానీ నాటకీయంగా టెల్ అవీవ్, టెహ్రాన్, అమెరికా కాల్పుల విర‌మ‌ణ‌ను ప్ర‌క‌టించ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

Iran-Israel Ceasefire | విజ‌యం ఎవ‌రిది?

12 రోజుల పాటు జ‌రిగిన ఈ యుద్ధంలో ఎవ‌రు గెలిచారని అంటే ఎవ‌రు గెలువ‌లేద‌ని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ అణు కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఇజ్రాయెల్(Israel) ప్రారంభించిన యుద్ధం ఆ దిశ‌గా విజ‌యాన్ని సాధించ‌లేదు. ఈ దాడుల‌ను ముందుగానే ఊహించిన టెహ్రాన్‌.. శుద్ధి చేసిన 400 కిలోల యూరేనియంను ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించింది. అందుకే ఇజ్రాయెల్‌, అమెరికా అణ్వ‌స్త్ర కేంద్రాల‌పై దాడి చేసినా ఎక్క‌డా రేడియో ధార్మికత పెరిగిన‌ట్లు వెల్ల‌డి కాలేదు. అంటే ఎప్ప‌టికైనా ఇరాన్ మ‌ళ్లీ అణ్వాయుధాన్ని త‌యారు చేసేందుకు ఆస్కార‌ముంద‌న్న మాట‌. మ‌రోవైపు, ప్ర‌తీకార దాడుల‌కు దిగిన ఇరాన్ కూడా పెద్ద‌గా సాధించేమీ లేదు. అత్యంత అధునాత‌న ఆయుధాలు, బ‌ల‌మైన బ‌ల‌గాలున్నాయ‌ని చెప్పుకునే టెహ్రాన్‌ను ఇజ్రాయెల్‌ను చెప్పుకోద‌గ్గ స్థాయిలో దెబ్బ కొట్ట‌లేకపోయింది. ఇక‌, మ‌ధ్య‌లో దూరిన అమెరికాకు ఇరాన్ ఏమాత్రం భ‌య‌ప‌డ‌లేదు. ఖ‌తార్‌లోని ఆ దేశ వైమానిక స్థావ‌రంపై దాడికి అగ్ర‌రాజ్యం అహంభావాన్ని దెబ్బ కొట్టింది.

Iran-Israel Ceasefire | ఎవ‌రి వాద‌న వారిదే..

అయితే, తాజా యుద్ధం వ‌ల్ల అంతిమంగా రెండు దేశాలు తీవ్రంగానే న‌ష్ట‌పోయాయి. కానీ ప్ర‌స్తుత సంఘ‌ర్ష‌ణ‌లో త‌మ‌దే విజ‌యమని చెప్పుకోవ‌డానికి ఆ దేశాల‌కు ఆస్కారం ఏర్ప‌డింది. ఇరాన్ అణు సామర్థ్యాలను తగ్గించామ‌ని అమెరికా చెప్పుకోవచ్చు. ఇక ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌ను దెబ్బ కొట్టామ‌ని, ఆ దేశం అణ్వ‌స్త్రాలు(Nuclear weapons) త‌యారు చేయ‌కుండా అడ్డుప‌డ్డామ‌ని గొప్ప‌గా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. ఇక ఈ యుద్ధంలో ఒంట‌రిగా పోరాడిన ఇరాన్ తాము ఎక్క‌డా భ‌య‌ప‌డ‌లేద‌ని, అత్యంత శ‌క్తివ‌తంత‌మైన అమెరికాపైనే దాడి చేశామ‌ని చెప్పుకోవ‌చ్చు.

Exit mobile version