అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Court | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని చదును చేసి వేలం వేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం యోచించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై హెచ్సీయూ విద్యార్థులు (HCU Students) పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
విపక్షాలు సైతం కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వ తీరును తప్పు పట్టాయి. దీనిపై పలువురు సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించగా.. అక్కడ ఎలాంటి పనులు చేపట్టొద్దని ధర్మాసనం గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో మంగళవారం కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల్లో పర్యావరణ పునరుద్ధరణపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పనులు చేపట్టడం లేదని, పర్యావరణాన్ని పునరుద్ధరిస్తున్నామని పేర్కొంది. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Supreme Court | ఆగస్టు 13కు విచారణ వాయిదా
ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పరిశీలనకు అమికస్ క్యూరీ సమయం కోరింది. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అని ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు కోర్టు తదుపరి విచారణ ఆగస్ట్ 13కు వాయిదా వేసింది.