అక్షరటుడే, వెబ్‌డెస్క్: TRAI | స్పామ్ (Spam), అవాంఛిత టెక్ట్ మెస్సేజ్‌లను గుర్తించడానికి టెల్కోలు (Telco) చర్యలు చేపట్టాయి.
ఇందులో భాగంగా సందేశాల స్వభావాన్ని గుర్తించడం, స్పామ్‌ను తగ్గించడంలో వినియోగదారులకు సహాయపడడం కోసం మెస్సేజ్‌లను (Message) నాలుగు రకాలుగా గుర్తించి వాటికి హెడర్‌లు (కోడ్‌లు) ఇవ్వాలని నిర్ణయించాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టాయి. ప్రజలు తాము అందుకుంటున్న సందేశ రకాన్ని సులువుగా గుర్తించడానికి ఈ కోడ్‌లు ఉపయోగపడతాయని టెల్కోలు పేర్కొంటున్నాయి. దీని ప్రకారం మెస్సేజ్‌ల వర్గీకరణను బట్టి వాటిని పంపించే వారి పేరు లేదా హెడర్‌కు ముందు నిర్దిష్ట కోడ్ వస్తుంది.
ప్రమోషనల్ ఎస్‌ఎంఎస్ (Promotional SMS)లకు ఆంగ్ల అక్షరం ‘పి’, సర్వీస్ సంబంధిత మెస్సేజ్‌లకు ‘ఎస్’, లావాదేవీలకు సంబంధించిన వాటికి ‘టి’, ప్రభుత్వం నుంచి వచ్చే సందేశాలకు ‘జి’ అని ఉంటుంది. ఈ కోడ్‌లతో ఏ ఎస్‌ఎంఎస్ ఏ కోవకు చెందినదో సులువుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి మన మొబైల్‌కు వచ్చే సందేశం ప్రమోషనల్ కు సంబంధిచినదా, సేవకు సంబంధించినదా, లావాదేవీ సందేశమా లేదా ప్రభుత్వం నుంచి వచ్చిందా అన్నది ఆయా హెడర్‌ల ద్వారా ఆ సందేశాన్ని తెరవకముందే తెలిసిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా అవాంఛిత మెస్సేజ్(Unwanted message)లకు దూరంగా ఉండవచ్చు. అయితే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఓవర్ ది టాప్ మెసేజింగ్ యాప్‌లను ఈ కొత్త నియమాల పరిధిలో చేర్చలేదు. ఆయా యాప్‌లలోనూ ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.