అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Vice President | ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా(Jagadeep Dhankhar Resign) చేసిన నేపథ్యంలో ఆయన వారసుడు ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ధన్‌ఖడ్ అనూహ్య రాజీనామాకు దారి తీసిన కారణాలతో పాటు కొత్త ఉప రాష్ట్రపతి(New Vice President) ఎంపిక జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెర పైకి వస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Manoj Sinha)తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్డీయే సర్కారు వీరిలో ఒకరిని ఉప రాష్ట్రపతిగా ప్రతిపాదించే అవకాశముందని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Vice President | రెండు నెలల్లోనే..
ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ అయిన రెండు నెలల్లోనే ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం(Central Government) దృష్టి సారించింది. ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిసి ఎన్నుకుంటారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి రెండు సభల్లోనూ మెజార్టీ ఉంది. ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీకి పెట్టిన తగిన బలం లేకపోవడంతో పెద్దగా ప్రయోజనం ఉండదు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎవరిని నిలబెట్టినా సులువుగా గెలువడం ఖాయం. దీంతో తదుపరి ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపై కేంద్రం దృష్టి సారించింది. వివాదాలకు దూరంగా ఉండే, అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని అభ్యర్థిగా ప్రతిపాదించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి.
Vice President | శశిథరూర్..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్(Shashi Tharoor) పేరును ఉప రాష్ట్రపతి పదవి కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ తీరును తప్పుబడుతుండడంతో పాటు బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు. ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ విషయంలో మోదీ సర్కారు(Modi Government)కు పూర్తి అండగా నిలబడ్డారు. కేంద్రం తరఫున విదేశాల్లో ఆపరేషన్ సిందూర్‌పై గళం వినిపించారు. దీనికి తోడు పలుమార్లు మోదీ ప్రభుత్వాన్ని పొగిడి వార్తల్లో నిలిచారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై ఆయన ఇటీవల విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ధరూర్ బీజేపీ పాట పాడుతున్నారని కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన వాటిని కొట్టి పాడేస్తూ సొంత పార్టీని ఇరుకున పెట్టేలా పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కంటే దేశానికి ప్రాధాన్యమివ్వాలని, పార్టీల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ దూరం పెట్టిన శశిథరూర్‌ను బీజేపీ ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
Vice President | నితీష్ కుమార్
ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అయిన నితీష్ కుమార్(Bihar CM Nitish Kumar) (74) పేరు బలంగా వినిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివిధ పార్టీలతో సాన్నిహిత్యం కారణంగా ఆయన పేరును బీజేపీ ఎంచుకోవన్న భావన వ్యక్తమవుతోంది. దీని వెనుకాల బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. త్వరలో బీహార్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో నితీశ్‌ను రాజకీయ తెర నుంచి పక్కకు తప్పించాలన్నది బీజేపీ ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. నితీశ్‌కుమార్ ఎప్పుడు ఏ పార్టీతోనూ స్థిరంగా ఉండరు. అవసరాన్ని బట్టి గోడ దూకుతూ పార్టీలో జట్టు కడుతుంటారు. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటూ వస్తున్నారు. బీహార్‌లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ.. ఆయనను మరో కీలకమైన పోస్టులోకి తీసుకురావాలని భావిస్తోందని, అందుకే ఉప రాష్ట్రపతిగా ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Vice President | వీకే సక్సేనా
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Delhi Lieutenant Governor VK Saxena) (67) పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన సక్సేనా, రాజకీయ అనుభవంతో పాటు పరిపాలనా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి పరోక్షంగా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గత మూడేళ్లుగా దిల్లీలో ఆయన చేసిన కృషి, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో రాజకీయ ఘర్షణలు ఆయనను వార్తల్లో నిలిపాయి. దిల్లీ జల్ బోర్డు నిర్ణయాల నుంచి నియామకాల వరకు.. సక్సేనా ఆప్ ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఈ చర్యలు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కొట్టుకుపోయి కమలం వికసించింది. ఇందుకు వీకే సక్సేనా చేసిన ప్రయత్నాలే కారణమని బీజేపీ శ్రేణులు చెబుతాయి.
Vice President | మనోజ్ సిన్హా
ఉప రాష్ట్రపతి రేసులో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Lieutenant Governor Manoj Sinha) (66) కూడా వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడైన సిన్హా, రైల్వే శాఖలో జూనియర్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన అనుభవం ఈ పదవికి బలం చేకూరుస్తుందని పలువురు భావిస్తున్నారు.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో స్థిరత్వాన్ని తీసుకొచ్చిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. వచ్చే నెలలోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ సమయంలో ఉప రాష్ట్రపతి పదవి ఆయనకు సరైన అవకాశంగా కనిపిస్తోంది. కానీ, పహాల్గామ్ ఉగ్రదాడి ఘటన ఆయన అవకాశాలను సంక్లిష్టం చేస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.