అక్షరటుడే, వెబ్‌డెస్క్:Maruti Suzuki | దేశీయ కార్ల తయారీ రంగంలో దిగ్గజ సంస్థ అయిన మారుతి సుజుకీ(Maruti Suzuki).. శుక్రవారం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. అయితే వార్షిక ఫలితాలు నిరాశ పరిచినా.. గత త్రైమాసికం(Last Quarter)తో పోల్చితే గణనీయమైన ప్రగతి కనిపించింది. ఎగుమతుల(Exports)తోపాటు దేశీయంగా రికార్డుస్థాయిలో విక్రయాలు జరగడంతో ఈ వృద్ధి నమోదైనట్లు భావిస్తున్నారు. కాగా వార్షిక ఫలితాలు కాస్త నిరాశ పరిచినా.. కంపెనీ షేర్ హోల్డర్‌లకు మాత్రం ఉత్సాహాన్ని నింపే ప్రకటన చేసింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రకటించింది.
Maruti Suzuki | పెరిగిన ఆదాయం
ఆపరేషన్స్(Operations) ద్వారా కంపెనీ ఆదాయం(Revenue) 6.37 శాతం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో రూ. 38,585 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో రూ. 40,920 కోట్లకు చేరింది. మూడో క్వార్టర్‌లో రూ. 37,614 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. నాలుగో క్వార్టర్‌కు వచ్చేసరికి 8.8 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 40,920 కోట్లకు ఎగబాకింది.
Maruti Suzuki | నికర లాభం..
నికర లాభం(Net profit) మాత్రం గతేడాది ఇదే సీజన్‌తో పోల్చితే 4.3 శాతం పడిపోయింది. కాగా గత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌తో పోల్చితే నాలుగో క్వార్టర్‌లో నికర లాభం 15.7 శాతం పెరగడం గమనార్హం. చిన్న కార్ల విక్రయాలు తగ్గడం, పోటీని తట్టుకోవడానికి డిస్కౌంట్లు(Discount) ప్రకటించడం, మార్కెటింగ్ ఖర్చులు పెరగడంతో లాభాలు తగ్గినట్లు భావిస్తున్నారు. అయితే సీఎస్‌జీ(CNG) వాహనాల విక్రయాలు పెరగడంతో మార్జిన్లు స్థిరంగా ఉన్నాయి. గ్రామీణ మార్కెట్(Rural market)లో ఇప్పటికీ మారుతికి డిమాండ్ ఉండడంతో చాలా మంది అనలిస్టులు ఈ స్టాక్‌కు బై రేటింగ్ ఇస్తున్నారు.
Maruti Suzuki | కంపెనీ చరిత్రలో అతిపెద్ద డివిడెండ్..
మారుతి సుజుకీ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద డివిడెండ్(Dividend)ను ప్రకటించింది. ఒక్కో షేరుపై రూ. 135 ఇవ్వనున్నట్లు పేర్కొంది. చివరిసారి గతేడాది ఆగస్టులో 120 రూపాయల ఫైనల్ డివిడెండ్ ఇచ్చింది.
Maruti Suzuki | స్టాక్ పనితీరు..
గత ట్రేడింగ్ సెషన్‌లో మారుతి 1.65 శాతం తగ్గి రూ. 11,698 వద్ద నిలిచింది. ఈ స్టాక్(Stock) 52 వారాల గరిష్ట ధర రూ. 13,680 కాగా.. కనిష్ట ధర రూ. 10,725. ఐదేళ్లలో 18 శాతం సీఐజీఆర్(CAGR)తో వృద్ధి చెందిన స్టాక్.. ఏడాది కాలంలో మాత్రం ఎనిమిది శాతం నెగెటివ్ రిటర్న్స్ అందించింది.