అక్షరటుడే, ఇందూరు: State Finance Commission | ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య (State Finance Commission Chairman Siricilla Rajaiah) సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని, ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు కృషి చేయాలని తెలిపారు.
చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి అన్ని వర్గాల వారు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి.. మానవ సంపద, వారి శక్తి సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు.
State Finance Commission | రక్షిత తాగునీటి సరఫరా..
గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రతి నివాస గృహానికి రక్షిత తాగునీరు సరఫరా జరిగేలా చూడాలన్నారు. పారిశుధ్య నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని సూచించారు. కొత్త జీపీలుగా మారిన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగిస్తే కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రయోగాత్మకంగా చిన్న గ్రామపంచాయతీల్లో సోలార్ విద్యుత్ విధానాన్ని అమలు చేస్తూ క్రమంగా అన్ని స్థానిక సంస్థలకు విస్తరించాలన్నారు. అలాగే పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడకుండా ఆదాయం సమకూర్చి అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
State Finance Commission | స్థానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి
పన్ను వసూలు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు ఇతర నిర్మాణాలకు సంబంధించిన నిర్ణీత రుసుము వసూలు చేస్తూ స్థానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలని అధికారులకు రాజయ్య సూచించారు. అనంతరం స్థానిక సంస్థల్లో ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు ఉన్న అవకాశాలపై అధికారుల నుంచి సలహాలు స్వీకరించారు.
సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్ తాహెర్ బిన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ (State Agricultural Commission) సభ్యుడు గడుగు గంగాధర్, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, చందర్ రాథోడ్, నిజామాబాద్ ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియన్మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, జడ్పీ సీఈవోలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.