అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం పలు జిల్లాల్లో వాన దంచి కొట్టింది. ఈ రోజు కూడా మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు పడ్డాయి. దీంతో కొద్ది రోజులుగా వానలు లేక ఆందోళన చెందుతున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వానాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి భారీ వర్షాలు పడలేదు. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో అన్నదాతలు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా రాత్రి పూట భారీగా పడింది. వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది రోడ్డుపై నిలిచిన నీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు.
Weather Updates | ఆ జిల్లాల్లో కురవని వాన
తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అయితే మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడలేదు. దాదాపు పది రోజులుగా వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో రైతులు నిత్యం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. అయితే మేఘాలు వస్తున్నాయి తప్ప వర్షాలు రావడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.