అక్షరటుడే, వెబ్డెస్క్: Hydra Police Station | తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా(Hydra) ఏర్పాటుతో ఇప్పటికే చెరువులు, కుంటల్లోని ఆక్రమణలతో పాటు, రోడ్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం హైడ్రా పోలీస్ స్టేషన్(Hydra Police Station) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఇక ఈ ఠాణాలోనే ప్రజలు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. గతంలో ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన భూకబ్జా కేసులు.. ప్రస్తుతం హైడ్రా ఠాణాకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
Hydra Police Station | ఏసీపీ స్థాయి అధికారికి బాధ్యతలు
హైడ్రా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో(SHO)గా ఏసీపీ స్థాయి అధికారి ఉండనున్నట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం అంతా దీని పరిధిలోని రానుంది. ఓఆర్ఆర్(ORR) లోపల ఎక్కడ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా అయినా ఈ ఠాణాలోనే కేసులు నమోదు చేయనున్నారు. దీని విస్తిర్ణం 2,053 చదరపు కిలో మీటర్లు ఉండనున్నట్లు సమాచారం.
Hydra Police Station | జాప్యాన్ని నివారించేందుకు..
ప్రభుత్వ భూములు, కుంటలు, రోడ్లు, చెరువుల ఆక్రమణలపై కేసులను ప్రస్తుతం ఇతర పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. అయితే ఇతర కేసులతో బిజీగా ఉండే పోలీసులు(Police) వాటిపై త్వరగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఆ కేసుల దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు హైడ్రా పోలీస్ స్టేషన్(Hydra Police Station)ను ఏర్పాటు చేస్తున్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై ఈ ఠాణాలో ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం(పీడీపీపీ) కింద కేసులు నమోదు చేయాలని హైడ్రా యోచిస్తోంది.