అక్షరటుడే, ఇందూరు/ఆర్మూర్: Nizamabad Collector | మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (District Collector Vinay Krishna Reddy) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 200 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని (Mahalaxmi scheme) వినియోగించుకున్న సందర్భంగా బుధవారం ఆర్మూర్ బస్టాండ్ లో సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గడిచిన 20 నెలలలో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని (Women free travel facility) వినియోగించుకున్నారని పేర్కొన్నారు. తద్వారా ప్రయాణ ఛార్జీల రూపంలో రూ.6,680 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయని చెప్పారు. ఉచిత ప్రయాణ వసతి వల్ల మహిళలు తమ అవసరాల నిమిత్తం విరివిగా పథకాన్ని వినియోగిస్తున్నారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు.
Nizamabad Collector | జిల్లాలో 5.54 కోట్లమంది..
నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) 5.54 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.230 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని తెలిపారు. అలాగే మహిళ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో నిజామాబాద్ రీజియన్ పరిధిలో కొత్తగా 141 బస్సులను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో (essay writing competitions) గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జ్యోత్న్స, ఆర్మూర్ డిపో మేనేజర్ రవికుమార్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.