అక్షరటుడే, వెబ్‌డెస్క్: Congress | కాంగ్రెస్ క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi)పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్(AICC Secretary Sampath Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మల్లు రవి అంటే తమకు గౌరవం ఉందన్నారు. ఎమ్మెల్యేతో ప్రోటోకాల్ పాటించడం తప్పు కాదని, కానీ చెయ్యి పట్టుకొని తీసుకెళ్లడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేను తమ వాడే అనడం పార్టీ లైన్ దాటినట్లే అవుతుందన్నారు.
ఎంపీ మల్లు రవిపై ఇటీవల కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(State In-charge Meenakshi Natarajan)కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కమీషన్ తీసుకుని బీఆర్ఎస్ నేతల బిల్లులు క్లియర్ చేయిస్తున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల బిల్లులు క్లియర్ చేయకుండా బీఆర్ఎస్ నేతల బిల్లులు క్లియర్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.
సంపత్‌కుమార్ అలంపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన విజయుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఎంపీ మల్లు రవి, విజయుడితో సన్నిహితంగా ఉండడంతో కాంగ్రెస్ నేతలు(Congress Leaders) ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో సంపత్‌కుమార్ శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. మల్లు రవిపై వ్యాఖ్యానించారు. ఇంటికి వచ్చిన వారిని గౌరవించడంలో తప్పు లేదు కానీ సన్మానాలు చేయడం, ఫోటోలు దిగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇదంతా పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టినట్లే అవుతుందన్నారు. తాను పార్టీ లైన్ దాటనని, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని సంపత్‌కుమార్ ప్రకటించారు. మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుని కాంగ్రెస్‌లోకి తెస్తే అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు.
Congress | శవరాజకీయాలు చేస్తున్న హరీశ్‌రావు
మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) శవ రాజకీయాలు చేస్తున్నారని సంపత్‌కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ రాజకీయ కుట్రలో భాగంగానే ధన్వాడ ఘటన జరిగిందన్నారు. ఇటీవల ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి వచ్చిన కంపెనీ సిబ్బందిపై పలు గ్రామాల ప్రజలు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. రైతులపై బీఆర్ఎస్ కార్యకర్తలు(BRS Leaders) దాడులు చేశారని ఆరోపించారు. ఇథనాల్ కంపెనీ(Ethanol Company)కి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం,కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చాయన్నారు.