అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kerala Former CM | కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ (101) (Former Kerala CM Achuthanandan) కన్నుమూశారు. తిరువనంతపురంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జూన్ 23 ఆయనకు గుండెపోటు రావడంతో ఎస్యూటీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం మధ్యాహ్నం 3.20 గంటలకు మరణించారు.
Kerala Former CM | వ్యవసాయ కార్మిక కుటుంబంలో పుట్టి..
కేరళ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రముఖ నాయకుడు, కమ్యూనిస్ట్ ఉద్యమంలో దిగ్గజం వెలిక్కకతు శంకరన్ అచ్యుతానందన్ (వీ.ఎస్. అచ్యుతానందన్). ఆయన 1923 అక్టోబరు 20న అలప్పుజా జిల్లాలో (Alappuzha district) ఒక వ్యవసాయ కార్మిక కుటుంబంలో జన్మించారు. నాలుగేళ్ల వయస్సులో తల్లిని, 11 ఏళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయారు. ఆయన ఏడో తరగతి వరకు చదివి, తన అన్న వద్ద టైలర్‌గా పనిచేశారు. 1939లో స్టేట్ కాంగ్రెస్‌లో చేరి, 1940లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యారు. పున్నప్ర – వాయలార్ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఐదేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు.
Kerala Former CM | సీపీఎం స్థాపకుల్లో ఒకరు
1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) (Communist Party of India) నుంచి విడిపోయి.. సీపీఐ(ఎం) స్థాపనలో కీలకంగా వ్యవహరించిన 32 మంది నాయకుల్లో అచ్యుతానందన్ ఒకరు. 1980 నుంచి 1992 వరకు సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శిగా(CPM Kerala State Secretary), 1996-2000 మధ్య ఎల్‌డీఎఫ్ కన్వీనర్‌గా పనిచేశారు. 1985-2009 మధ్య పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. కేరళ శాసనసభకు ఏడుసార్లు ఎన్నికయ్యారు. అలాగే 15 ఏళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
Kerala Former CM | ముఖ్యమంత్రిగా సేవలు
అచ్యుతానందన్ 2006లో మలంపుజా నియోజకవర్గం నుంచి గెలిచి కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో వల్లర్‌పాడం టెర్మినల్, కొల్లం టెక్నోపార్క్, కన్నూర్ విమానాశ్రయం (Kannur Airport), కొచ్చి మెట్రో ప్రాజెక్టులకు పునాది వేశారు. కాగా.. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.