అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Fish Venkat | తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికే చాలా మంది కమెడీయన్స్‌ని కోల్పోయింది. తాజాగా తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ (Fish Venkat) కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. 1971, ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం (Machilipatnam)లో జన్మించారు. చిన్నతనంలో ఆయన కుటుంబం హైదరాబాద్‌కు వలస రావడంతో జీవనోపాధి కోసం ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్మే వ్యాపారం చేశాడు. అయితే వెంకట్‌కు సినిమా పట్ల అపారమైన అభిమానం ఉండేది. అప్పట్లో హైదరాబాద్ (Hyderabad)లో షూటింగ్‌లకు వెళ్లి చూస్తుండేవాడు.
Fish Venkat | ఆ సినిమాతోనే..
అదృష్టం కలిసి రావడం, నటుడు శ్రీహరి ద్వారా పరిచయం, తర్వాత దర్శకుడు వి.వి. వినాయక్ ద్వారా సినిమా రంగ ప్రవేశం.. ఇవే వెంకట్ జీవితాన్ని మలుపు తిప్పాయి. వెంకట్ వినాయక్‌ను తన గురువుగా భావిస్తూ జీవితాంతం గౌరవించేవారు. వెంకట్‌కు గుర్తింపు తెచ్చిన చిత్రం ‘ఆది’ (2002). యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన చెప్పిన “ఒక్కసారి తొడకొట్టు చిన్నా” అనే డైలాగ్ అతనికి ఎంతో పేరును, గుర్తింపును తెచ్చింది. తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 100కి పైగా సినిమాల్లో ఆయన కనిపించారు. విలన్ అనుచరుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సహాయక పాత్రలలో నటించి మెప్పించారు. చిన్న చిన్న పాత్రలో కూడా వెంకట్ హాస్యాన్ని మిక్స్ చేయడంలో తనదైన మార్క్ చూపించారు. ప్రత్యేకంగా తెలంగాణ యాస, ఆ యాసలో వచ్చే పంచ్‌లు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టించాయి.
వెంకట్ జీవితంలోని అసలైన కష్టాలు తెర వెనుక సాగాయి. రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడం, డయాలసిస్ మీద ఆధారపడటం, లివర్ సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్ అదుపులో లేకపోవడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు, కానీ ఆయనకు దాతలు దొరకలేదు. అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందలేదు. చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో. జూలై 18న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి(Private Hospital)లో వెంకట్ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.