అక్షరటుడే, వెబ్‌డెస్క్: Supreme Court | భద్రతా బలగాల(Security Forces) మనోస్థైర్యం దెబ్బ తీసే చర్యలను ఉపేక్షించమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి(Terrorist Attack)పై న్యాయ విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది. ఇది సాయుధ దళాలను నిరాశపరిచే చర్యల కిందకు వేస్తుందని హెచ్చరించింది. “ఉగ్రవాదంతో పోరాడడానికి దేశం మొత్తం చేతులు కలిసిన సమయం ఇది” అని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తు చేసింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవవడానికి పిల్ వేసిన ఫాతేష్ కుమార్ సాహు(Fatesh Kumar Sahu)కు అనుమతించింది.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam)లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అమాయకులైన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రధానంగా హిందువులను టార్గెట్‌గా చేసుకుని వారి పేరు, మతం అడిగి దారుణంగా హతమార్చారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం 26 మంది చనిపోయారు. వారిలో ఒకరు ముస్లిం కాగా, మిగతా వారంతా హిందువులే. ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం(Central Government) కూడా ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. అలాగే, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్(Pakistan)పై నలుదిక్కుల నుంచి దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉగ్రవాదుల కోసం ప్రత్యేక బలగాలు కశ్మీర్‌ను జల్లెడ పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో పహల్గామ్ దాడి(Pahalgam Attack)పై న్యాయ విచారణ జరపాలని కోరుతూ ఫాతేష్ కుమార్ సాహు పిల్ దాఖలు చేశారు. ఉగ్రవాద దాడిపై జవాబుదారీతనం ఉండేలా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(Special Investigation Team) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీన్ని విచారణకు స్వీకరించేందుకు అంగీకరించని న్యాయస్థానం.. భద్రతా బలగాల మనోస్థైర్యం దెబ్బ తీసే చర్యలను ఉపేక్షించమని స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రస్తుతం దేశమంతా చేతులు కలపాల్సిన సమయం ఇదని గుర్తు చేసింది.