అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Kavitha | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు. గురువారం ఆమె జాగృతి కార్యాలయం(Jagruti Office)లో విలేకరులతో మాట్లాడారు.
గోదావరి జలాల విషయంలో సీఎం తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జలశక్తి మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project) గురించి చర్చించినట్లు ప్రెస్ ఇన్ఫరేషన్ బ్యూరో ప్రెస్నోట్లో ఉందన్నారు. కానీ సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) మీడియా సమావేశంలో బనకచర్ల గురించి చర్చించలేదని చెప్పారన్నారు. సీఎం తీరుతో తెలంగాణ ప్రజలు గోదావరి జలాల్లో హక్కులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి సీఎం పదవి కొనసాగడానికి అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలన్నారు.
MLC Kavitha | సీఎం సాధించింది ఏమి లేదు
కేంద్ర మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో సీఎం నాలుగు విజయాలు సాధించినట్లు చెప్పారన్నారు. అందులో టెలీమెట్రి (Telemetry) ఒకటని ఆయన ప్రకటించారు. అయితే టెలీమెట్రి విధానం ఎప్పటి నుంచో అమలులో ఉందన్నారు. మొదటి దశ ఇప్పటికే అమలు చేస్తున్నారని, ఇప్పుడు రెండో దశ చేస్తారన్నారు. అందులో సీఎం సాధించిన విజయం ఏమిటని ఎద్దేవా చేశారు. అలాగే మన భూ భాగంలో ఉన్న నాగార్జున సాగర్ రిపేర్లు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) చూసుకుంటుందని, ఆంధ్రలో ఉన్న శ్రీశైలం మరమ్మతులు అక్కడి ప్రభుత్వం చేపడుతుందన్నారు.
MLC Kavitha | హక్కులను తాకట్టు పెట్టారు
నదుల అనుసంధానంపై గతంలో వివాదం చెలరేగినప్పుడు కూడా అధికారుల కమిటీ వేశారని, ఇప్పుడు కూడా వేస్తున్నారని కవిత పేర్కొన్నారు. ఈ కమిటీ అంశాల్లో బనకచర్ల ప్రాజెక్ట్ను చేర్చారని, సీఎం రేవంత్రెడ్డి అందులో సంతకం చేసి వచ్చారని మండి పడ్డారు. తెలంగాణ ప్రజల హక్కులను సీఎం రేవంత్రెడ్డి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దగ్గర తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ కుట్రపూరితమైనదని ఆమె అన్నారు. దీంతో ఆంధ్ర ప్రజలకు కూడా లాభం లేదన్నారు. కమీషన్ల కోసమే దీనిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ను మేఘా కంపెనీకి ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు.