అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asia Cup | ఆసియా కప్ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) వార్షిక సర్వసభ్య సమావేశానికి తాము హాజరు కాబోమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) తేల్చి చెప్పింది. సమావేశ వేదిక మార్చాలని కోరినప్పటికీ, ఏసీసీ నుంచి స్పందన కరువైంది.
ఈ నేపథ్యంలో జూలై 24న ఢాకాలో జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్(Asian Cricket Council) వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదించే తీర్మానాలను బహిష్కరిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని పేర్కొంటూ, సమావేశ వేదికను మార్చాలని భారత బోర్డు అధికారికంగా ACCని అభ్యర్థించిందని, కానీ ACC నాయకత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
Asia Cup | టోర్నీ కొనసాగేనా?
ఆసియా కప్ (Asia Cup) ఈ ఏడాది చివరలో జరగాల్సి ఉంది. ఆరు దేశాల T20 టోర్నమెంట్ అయిన ఆసియా కప్ ఇండియా నిర్వహించాల్సి ఉంది. అయితే, ప్రస్తుల పరిణామాలతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సెప్టెంబర్‌లో టోర్నమెంట్ విండో (Tournament Window) సమీపిస్తున్నప్పటికీ, అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రణాళిక ప్రకారం జరుగుతుందా లేదా అనే దానిపై అనుమానాలకు తావిస్తోంది. ఇండియాపై ‘అనవసరమైన ఒత్తిడి’ పెంచేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Asia Cup | భారత్‌పై ఒత్తిడికి యత్నం..
పాకిస్తాన్ అంతర్గత మంత్రి, ACC ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ (ACC Chairman Mohsin Naqvi) ఢాకాలో సమావేశాన్ని కొనసాగించడం ద్వారా భారతదేశంపై “అనవసరమైన ఒత్తిడి” ప్రయోగించడానికి ప్రయత్నిస్తున్నారని BCCI వర్గాలు ఆరోపించాయి. వేదికను మార్చకపోతే సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు మద్దతు ఇవ్వమని బీసీసీఐ స్పష్టం చేస్తోంది. “సమావేశ వేదిక ఢాకా నుంచి మారితేనే ఆసియా కప్ జరుగుతుంది. ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సమావేశం కోసం భారతదేశంపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వేదికను మార్చమని మేము అతనిని అభ్యర్థించాము, కానీ ఎటువంటి స్పందన రాలేదు. మొహ్సిన్ నఖ్వీ ఢాకాలో సమావేశాన్ని కొనసాగిస్తే బీసీసీఐ ఏ తీర్మానాన్ని అయినా బహిష్కరిస్తుంది” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Asia Cup | పాక్‌లో ఆడేందుకు భారత్ నిరాకరణ..
ఏసీసీ ఈవెంట్లలో ఇండియా పాల్గొనడంపై వివాదం రేగడం ఇదే మొదటిసారి కాదు. 2023లో పాకిస్తాన్ ఆసియా కప్ నిర్వహించింది. అయితే, మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో నిర్వహిస్తే తాము ఆడబోమని ఇండియా స్పష్టం చేసింది. దీంతో శ్రీలంకను తటస్థ వేదికగా ఎంపిక చేశారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలోనూ ఇలాగే జరిగింది. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించగా, ఆ దేశంలో ఆడేందుకు భారత్ నిరాకరించింది. దీంతో టీమిండియా ఆడే మ్యాచ్‌లను దుబాయ్ కేంద్రంగా నిర్వహించాల్సి వచ్చింది. 2025 పురుషుల ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్‌లో భారతదేశం పాల్గొనడం గురించి కూడా ఊహాగానాలు చెలరేగాయి. పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఉపసంహరించుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.