అక్షరటుడే, వెబ్‌డెస్క్:UNSC | పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉపదేశాలు ఇస్తోందని భారత్(India) తీవ్రంగా విమర్శించింది. ఇండియా ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతుంటే, పాక్ అప్పులు తీసుకోవడంలో బిజీగా ఉందని ఎద్దేవా చేసింది. బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్‌ను నిందించేందుకు పొరుగు దేశం చేసిన ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టింది. సీమాంతర ఉగ్రవాదానికి ఇస్లామాబాద్ మద్దతు కొనసాగిస్తున్న తీరును ఐక్యరాజ్యసమితి(United Nations)లో భారత శాశ్వత రాయబారి అయిన పర్వతనేని హరీశ్ ఎత్తి చూపారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన 26 మంది పౌరులను బలిగొన్న ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు.
UNSC | అభివృద్ధిలో భారత్.. అప్పుల్లో పాక్
అభివృద్ధి, సంక్షేమంలో భారత్ పురోగతి సాధిస్తూ ముందుకెళ్తుంటే, పాకిస్తాన్(Pakistan) మతోన్మాదం, ఉగ్రవాదంలో మునిగి పోయిందని హరీశ్ విమర్శించారు. అప్పులు తీసుకుంటూ మనుగడ కొనసాగిస్తోందని ఎద్దేవా చేశారు. ” భారత్ పురోగతి, శ్రేయస్సు, అభివృద్ధి నమూనాలో ముందుంది. ఇండియా పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశం. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సమ్మిళిత సమాజంతో ఇండియా ఒక వైపు దూసుకెళ్తుంటే.. మరోవైపు పాకిస్తాన్ ఉన్మాదం, ఉగ్రవాదంలో మునిగిపోయింది. IMF నుంచి వరుస అప్పులు తెచ్చుకుంటోంది. అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించడం గురించి మనం చర్చించుకుంటున్నప్పుడు.. విశ్వవ్యాప్తంగా గౌరవించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని గుర్తించడం చాలా అవసరం. వాటిలో ఒకటి ఉగ్రవాదాన్ని నిర్మూలించడం. అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులను అనుసరిస్తూ ధర్మోపదేశం చేయడం పాకిస్తాన్‌కు తగదు, ”అని పర్వతనేని హరీశ్(Parvataneni Harish) వ్యాఖ్యానించారు.
UNSC | ఉగ్రవాదాన్నిసహించకూడదు..
ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దాన్నిఎన్నటికీ సహించకూడదనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక విధానమని హరీశ్ గుర్తు చేశారు. దాన్ని ఎల్లప్పుడూ గుర్తించి గౌరవించాలని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. “అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించడం గురించి మనం చర్చించేటప్పుడు, విశ్వవ్యాప్తంగా గౌరవించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని గుర్తించడం చాలా అవసరం. వాటిలో ఒకటి ఉగ్రవాదాన్ని అస్సలు సహించకపోవడం, ”అని పర్వతనేని హరీష్ అన్నారు. పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని తీవ్రంగా ఖండించారు.