అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Raids | అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. లంచగొండి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. వరుస దాడులతో అక్రమార్కులకు భరతం పడతం పడుతోంది. శుక్రవారం ఒక్కరోజే నాలుగుచోట్ల దాడి చేసి, లంచం తీసుకుంటున్న అధికారుల ఆట కట్టించింది.
అంతకు ముందు రోజు కూడా మూడు చోట్ల దాడులు చేసింది. గత ఆర్నెళ్లలో సుమారు 150చోట్ల దాడులు చేసి భారీగా పోగేసిన రూ.కోట్లాది అక్రమార్జనను బయట పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో వందల కోట్ల అవినీతికి పాల్పడిన అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులపై(ACB Officers) ప్రశంసల వర్షం కురుస్తోంది.
ACB Raids | ప్రభుత్వ ఆదేశాలతో..
ఏసీబీ (ACB) కొంతకాలంగా స్వేచ్ఛగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుంచి పూర్తిగా మద్దతు ఉండడంతో అక్రమార్కుల భరతం పడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వివిధ శాఖల అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారు. పోలీసు, ఏసీబీ, విజిలెన్స్, నార్కోటిక్స్ విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేరాల నియంత్రణ, నిషేధిత డ్రగ్స్, గంజాయి సరఫరా కట్టడితో పాటు అవినీతిని నియంత్రించాలని సూచించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రజలను దోచుకుంటున్న వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ACB Raids | ఆర్నెళ్లలో 150 కేసులు..
ప్రభుత్వం నుంచి స్వేచ్ఛ లభించడంతో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదులో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గత ఆర్నెళ్లలోనే దాదాపు 150 కేసులు నమోదు చేసి, కోట్లాది రూపాయల అక్రమార్జనను వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే మొత్తం 21 కేసులు నమోదు చేసింది. అంతెందుకు ఈ నెలలో గత వారం రోజుల వ్యవధిలో సుమారు 20 మంది అక్రమార్కుల ఆట కట్టించింది.
ఒక్క శుక్రవారమే రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు లంచావతారుల బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఇందులో ఇద్దరు మహిళా అధికారులు ఉండడం గమనార్హం. పట్టా మార్పిడికి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసిన ఓ మహిళా డిప్యూటీ తహశీల్దార్‌ను (Female Deputy Tahsildar) అదుపులోకి తీసుకున్నారు. లేబర్ శాఖకు (Labor Department) చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఒకేరోజు పట్టుబడ్డారు. అంతకు ముందు అంటే గురువారం ఏసీబీ మరో ముగ్గురి ఆటకట్టించింది.
ACB Raids | కాళేశ్వరం అక్రమార్కులపై దాడి..
గత పదేళ్లలో జరిగిన అవినీతిపై దృష్టి పెట్టిన ఏసీబీ అప్పట్లో చక్రం తిప్పిన అధికారులపై గురి పెట్టింది. అత్యంత వివాదాస్పదమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వందల కోట్లు దండుకున్న అధికారుల బాగోతం బయటపెడుతోంది. ముగ్గురు కీలక వ్యక్తులపై దాడి చేసిన ఏసీబీ.. సుమారు రూ.వెయ్యి కోట్ల అక్రమాస్తుల చిట్టాను బయటపెట్టింది.
మాజీ ఈఎన్‌సీలు మురళీధర్‌రావు(Former ENC Muralidhar Rao), హరిరామ్ నాయక్‌తో పాటు ఈఈ నూనె శ్రీధర్ లను అరెస్టు చేసిన ఏసీబీ వారి ఇండ్లలో చేసిన సోదాల్లో వెలుగు చూసిన ఆస్తులను చూసి షాక్‌కు గురైంది. విల్లాలు, ప్లాట్లు, భూములు, బంగారం, వజ్రాలు, కంపెనీల్లో పెట్టుబడుల వివరాలను చూసి నివ్వెరపోయింది. వీరి నుంచి సమాచారాన్ని సేకరించి మిగతా లంచావతారులపై దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.