అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | తండాలో జ్వరాలు సోకిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna reddy) ఆదేశించారు. మోపాల్ మండలంలోని కల్పోల్ తండాలో (Kalpol Thanda) పలువురు జ్వరాల భారినపడిన విషయం తెలుసుకొని, ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వర పీడితుల వివరాలు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జ్వరాలు ప్రబలేందుకు గల కారణాలను గుర్తిస్తూ.. పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే స్థానికులు వైద్య శిబిరాన్ని (Medical camp) సందర్శించి తగిన చికిత్స పొందేలా చూడాలన్నారు.
Nizamabad Collector | పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేను పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల నడుమ నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. మురికి కాల్వలు, నీరు నిలువ ఉన్న ప్రదేశాల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, ప్రతి ఇంటిని సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని పేర్కొన్నారు.
Nizamabad Collector | పలు నివాసాల సందర్శన..
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తండాలోని పలు నివాసాలను స్వయంగా వెళ్లి పరిశీలించారు. పాత టైర్లు, ఇతర వస్తువులను గమనించి వాటిని నివాస ప్రదేశాలకు దూరంగా పారేయాలని స్థానికులకు సూచించారు. మరో వారం రోజులపాటు తండాలో వైద్య శిబిరం ఉంటుందని, జ్వరం ఇతర అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే శిబిరానికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ అధికారి (District Malaria Control Officer) డాక్టర్ తుకారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మోపాల్ ఎంపీడీవో రాములు, ఎంపీవో కిరణ్ తదితరులు ఉన్నారు.
కల్పోల్ తండాలో పాడుబడ్డ టైర్లను పరిశీలిస్తున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి