అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala | తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడటానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనేక చర్యలు చేపడుతోంది. అయితే ఎంతోకాలంగా టీటీడీలో అన్యమత ఉద్యోగులు(Non-Religious Employees) పని చేస్తున్నారు. వారిపై చర్యలు చేపట్టడంతో కొంతకాలంగా టీటీడీ అలసత్వం వహిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అయితే తాజాగా టీటీడీ నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ (Suspend) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇతర మతానికి చెందిన నలుగురు ఉద్యోగులపై టీటీడీ శనివారం వేటు వేసింది. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి ఎలిజర్ (Deputy Executive Engineer B.Eliezer), బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్స్ ఎస్ రోసి (Bird Hospital Staff Nurse S. Rossi), బర్డ్ ఆస్పత్రి గ్రేడ్–1 ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ డాక్టర్ జి అసుంతను సస్పెండ్ చేసింది. వారు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. విచారణ జరపగా.. క్రైస్తవ మతం అనుసరిస్తున్నట్లు తేలడంతో నలుగురిని తొలగించింది. కాగా.. ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పని చేస్తున్న రాజశేఖర్ బాబును కూడా టీటీడీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన చర్చికి ప్రార్థనలకు వెళ్తున్నట్లు ఆరోపణలు రావడంతో విచారించి, వేటు వేసింది.
Tirumala | ఇంకా చాలా మంది..
టీటీడీలో చాలా మంది అన్యమత ఉద్యోగులు పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇతర మతాలకు చెందిన వారు పని చేయకూడదు. అయినా అధికారులు ఇన్ని రోజులు చర్యలు చేపట్టలేదు. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) తిరుమలలో మాట్లాడుతూ.. టీటీడీలో వెయ్యి మందికి పైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారన్నారు. వారిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి(Anam Ramnarayana Reddy) సైతం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఇతర మత ఉద్యోగులు ఉన్నట్లు ఆయన ఒప్పుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నలుగురిని సస్పెండ్ చేయడం గమనార్హం. విజిలెన్స్ విచారణ మేరకు వారిపై వేటు వేసినట్లు టీటీడీ తెలిపింది. అయితే మిగతా వారిని కూడా తొలగించాలని భక్తులు కోరుతున్నారు.