అక్షరటుడే, హైదరాబాద్: Heavy Rain | హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడగా.. సాయంత్రం విజృంభించింది. రాత్రి తీవ్ర రూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఈ రోజు (జులై 18) రాత్రి నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Heavy Rain | భారీగా ట్రాఫిక్ జామ్..
మహా నగరంలో శుక్రవారం సాయంత్రం రెండు గంటల పాటు వాన దంచి కొట్టింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండాపూర్, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సికింద్రాబాద్‌లోని ‘పైగా’ కాలనీ వర్షానికి నీట మునిగింది. దీంతో కాలనీలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. అక్కడ పరిశ్రమలు, షోరూమ్‌లలో పని చేస్తున్న ఉద్యోగులు చిక్కుకుపోయారు.
Heavy Rain | ప్రగతినగర్‌లో ఇళ్లల్లోకి నీరు..
ఐటీ ఉద్యోగులు అధికంగా ఉండే ప్రగతినగర్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచింది. ప్రగతినగర్ చెరువు వద్ద ఉన్న అపార్ట్మెంట్ సెల్లార్లలోకి వరద నీరు చేరింది. డ్రెయినేజీ వాటర్ రివర్స్ కావడంతో అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి దుర్భంగా మారింది.
Heavy Rain | అప్రమత్తంగా ఉండాలి సీఎం
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. GHMC, HMDA, వాటర్ వర్క్స్ సమన్వయంతో పని చేయాలని సూచించారు. SDRF, NDRF, హైడ్రా బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.