అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uppal CI | పోలీసు శాఖకు కొత్త చిక్కు వచ్చి పడింది. లీకువీరులతో డిపార్ట్‌మెంట్ పరువు గంగలో కలుస్తోంది. నిందితులతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న కొందరు పోలీసు అధికారులు (Police Officers) రహస్యాలను చేరవేస్తున్నారు. కేసుల దర్యాప్తులో తదుపరి చేపట్టే చర్యలను లీక్ చేస్తున్నారు. ఇలా నిందితులకు సహకరిస్తూనే ఉప్పల్ సీఐ ఎలక్షన్‌రెడ్డి (Uppal CI Election Reddy) దొరికిపోయారు. దీంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటువేశారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖలో లీకువీరులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Uppal CI | సీఐసై వేటు
లంచాలకు మరిగి నిందితులతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. పైగా కేసుల నుంచి ఏ విధంగా తప్పుకోవాలో వారికి సలహాలు కూడా ఇస్తున్నారు. పోలీసులే కేసుల రహస్యాలను లీక్ చేస్తుండడం ఇబ్బందికరంగా పరిణమించింది. సొంత వాళ్లే సమాచారం చేరవేస్తుండడంతో దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) అక్రమాల వ్యవహారంలోనూ ఇదే జరిగింది.
ఉప్పల్ సీఐ ఎలక్షన్‌రెడ్డి కేసు దర్యాప్తు వివరాలను నిందితులకు చేర వేశారు. వాస్తవానికి ఈ కేసును సీఐడీ దర్యాప్తు (CID Investigation) చేస్తోంది. అయితే, ఎలక్షన్‌రెడ్డికి ఏ సంబంధం లేకపోయినా ఈ కేసులో తలదూర్చాడు. హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజు అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు సిద్ధం కాగా, ఆ సమాచారాన్ని సీఐ దేవరాజు (CI Devaraj)కు లీక్ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఉన్నతాధికారులు ఎలక్షన్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.
Uppal CI | లంచాలకు మరిగి..
కొందరు పోలీసు అధికారులు తప్పుదోవ పడుతున్నారు. న్యాయం కోసం వచ్చే వారి నుంచి భారీగా దండుకుంటున్నారు. సివిల్ మ్యాటర్లలో తలదూర్చి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక, రాజకీయ నేతలు, ప్రముఖుల సేవలో తరిస్తున్నారు. కావాల్సిన చోటకు పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు. ఠాణాలను అడ్డాలుగా చేసుకుని సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. భారీగా డబ్బులు తీసుకుంటూ సివిల్ వివాదాలను పరిష్కరిస్తున్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్ (Police Department)కే మచ్చ తెచ్చేలా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు.
Uppal CI | భయమే లేకుండా..
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసు శాఖలో కొందరు అధికారులు కట్టు తప్పుతున్నారు. జనాల్ని దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక, మొరం అక్రమ తరలింపునకు పరోక్షంగా సహకరిస్తూ దండుకుంటున్నారు. కొందరు పంచాయితీల్లో తలదూర్చి కూడబెడుతున్నారు. లంచాలకు మరిగిన ఇలాంటి అధికారులపై ఏసీబీ అడపాదడపా దాడులు చేసి పట్టుకుంటున్నా ఫలితం ఉండడం లేదు.
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన పోలీసులపై కఠిన చర్యలే లేకుండా పోయాయి. నాలుగు రోజుల సస్పెన్షన్ విధించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో నిందితులకు భయమన్నదే లేకుండా పోయింది. ఆ పోలీసు అధికారులు తీరా రాజకీయ నేతలు, ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని మళ్లీ పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారు. వాస్తవానికి తప్పు చేసిన వారిని సర్వీస్ నుంచి తొలగించాలి. కేసులు పెట్టి జైళ్లలో వేయాలి. అలా చేయకపోవడం వల్లే అవినీతిపరుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.