అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సనత్ నగర్ (Sanat Nagar) పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి.
నగర శివారులోని పాశమైలారంలో గల సిగాచి పరిశ్రమలో ఇటీవల పేలుడు చోటు చేసుకొని 44 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం అదే ప్రాంతంలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. తాజాగా సనత్‌నగర్ జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్ ఇండస్ట్రీస్‌లో (Durodine Industries) గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ పరిశ్రమలో పేపర్ ప్లేట్స్(Paper Plates), ప్లాస్టిక్ సామగ్రి(Plastic Utensils) తయారు చేస్తారు. దీంతో మంటలు వేగంగా పరిశ్రమ అంతా వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మంటలు వ్యాపించడానికి కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పరిశ్రమల్లో వరుస అగ్ని ప్రమాదాలతో కార్మికులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.