అక్షరటుడే, వెబ్‌డెస్క్:YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌బుక్ రాజ్యాంగం(Redbook Constitution) పాలన సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో పలువురు యువకులను పోలీసులు(Police) రోడ్డుపై దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కాగా.. పోలీసులు కొట్టడంతో గాయపడ్డ యువకులను వైఎస్ జగన్(YS Jagan) మంగళవారం పరామర్శించారు.
YS Jagan | రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పాయి
పోలీసుల దాడిలో గాయపడ్డ యువకులను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పాయని ఆయన అన్నారు. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని విమర్శించారు. పోలీసుల వ్యవస్థను చంద్రబాబు(CM Chandrababu) దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా.. దాని అణగదొక్కేందుకు వైసీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. తెనాలి(Tenali)లో పోలీసులు కొట్టిన ముగ్గురు.. అణగారిన వర్గాల వారికి చెందిన వారని జగన్ తెలిపారు. గొడవను ఆపే ప్రయత్నం చేయడమే వాళ్లు చేసిన తప్పా అని ప్రశ్నించారు. మంగళగిరి నుంచి వారిని కొట్టుకుంటూ తీసుకొచ్చారన్నారు.
YS Jagan | సమర్థించిన హోంమంత్రి
తెనాలి ఘటనను ఇటీవల హోం మంత్రి అనిత(Home Minister Anita) సమర్థించారు. వాళ్లు రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ అని ఆమె పేర్కొన్నారు. ముందుగా వారు పోలీసులపై దాడి చేయడంతోనే వారిని కొట్టారని చెప్పారు. అయితే చట్ట ప్రకారం శిక్షించకుండా రోడ్డుపై పోలీసులు ఇలా కొట్టడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో పోలీసులను హోంమంత్రి సమర్థిస్తే వారు మరింత రెచ్చిపోతారని పలువురు పేర్కొంటున్నారు.